“ఉత్తమ తెలుగు వాన కథలు” అనే పుస్తకం

మీకు వర్షం అంటే ఇష్టమా?

నాకయితే వర్షంలో మా ఇంటి మీద కొబ్బరి చెట్టు ఆకులకింద కూచుని తుంపర తుంపరగా వాన పడుతుంటే ఒక చేతిలో పుస్తకం పట్టుకుని ఇంకో చేతిలో టీ గ్లాసు పట్టుకుని చదువుతూ ఉంటే జీవితానికి అది చాలనిపిస్తుంది.

వాన కథలు చాలానే ఉన్నా, కొన్ని కథలు మాత్రం మనల్ని మాయ చేస్తాయి, మనం ఎండాకాలం మిట్టమధ్యానం ఫ్యాను కూడా లేని రూం లోకూచుని ఆ కథని చదివినా మన మనసుని వర్షం లో తడుస్తున్న అనుభూతి కలిగిస్తాయి.

“ఉత్తమ తెలుగు వాన కథలు” అనే పుస్తకం తెలుగు లో వచ్చిన వాన కథలలోంచి ఆణిముత్యాలు అనదగిన కథలని కూర్చిన కథా సంకలనం.

“మహమ్మద్ ఖదీర్ బాబు” సంపాదకత్వంలో వచ్చిన ఈ పుస్తకాన్ని ప్రచురించింది “ఛాయా రీసోర్సెస్ సెంటర్, హైద్రాబాద్” వారు.

ఈ పుస్తకంలో ఉన్న కథలు

1. గాలివాన – పాలగుమ్మి పద్మరాజు

2. వర్షం – రావి శాస్త్రి

3. ఊరి చివరి ఇల్లు – దేవరకొండ బాల గంగాధర తిలక్

4. డబ్బు – బీనా దేవి

5. అదృష్టహీనుడు – శారద

6. రెండు గంగలు – సత్యం శంకరమంచి

7. పాలు – బి.యెస్.రాములు

8. అతడి పేరు మనిషి – మహేంద్ర

9. గాలివాన – ఎ.ఎం.అయూధ్యా రెడ్డి.

10. పేగు కాలిన వాసన – జగన్నాధ శర్మ.

11. గోడ – కుప్పిలి పద్మ.

12. వాన రాలే – స్వామి.

13. ముసురు పట్టిన రాత్రి – గుమ్మా ప్రసన్న కుమార్.

14. అతడు మనిషి – అద్దేపల్లి ప్రభాకర్.

15. నిశ్శబ్దపు పాట – శ్రీకాంత్.

16. ఉత్తర పొద్దు – స.వెం.రమేశ్.

17. వాన కురిసింది – గంగుల నరసింహా రెడ్డి.

18.మృగశిర – అజయ్ ప్రసాద్.

19. నగరంలో వాన – పూడూరి రాజిరెడ్డి.

20. ఒక సాయంకాలపు అదృష్టం – మహమ్మద్ ఖదీర్ బాబు.

నాకు బాగా నచ్చిన కథలు రెండు గంగలు, అతడు మనిషి , ఒక సాయంత్రపు అదృష్టం.

రెండు గంగలు చదువుతుంటే అసలు, ఆ కృష్ణ ఒడ్డున మనమే వానలో తడుస్తున్నామా అన్నట్లు ఉంటుంది , శాస్త్రి గారి మనవడి లాగే మనం కుడా కథ అయిపోయిందని చెప్పకు తాతయ్య అనాలనిపిస్తుంది.

ఒక సాయంకాలపు అదృష్టం కథ మనలో చాలా మంది జీవితాలలో జరిగినదే / జరుగుతున్నదే , మన దగ్గర ఉన్న వాటిని ఆనందించకుండా గతంలో నో లేక భవిష్యత్తులోనో ఆలోచిస్తూ వర్తమానాన్ని సంతోషంగా గడపని వాళ్లకి ఈ కథ ఒక కనువిప్పు.

ఇక అతడు మనిషి కథలో ఒక నాగరికుడు [ సిటీ జీవితానికి అలవాటు పడ్డవాడు ] అనుకోని పరిస్థితిలో వరదల వలన ఒక పూరి గుడిసెలో తల దాచుకోవలసి వస్తుంది.

అతను గుడిసెలో వాళ్ల గురించి ఒక చోట ఇలా అనుకుంటాడు, ” ఫ్రిజ్ లేదు, మంచాల్లేవు ఏమిటీ బతుకు? ఉన్నత స్థితికి ఎగబాకిపోవాలనే killing instinct లేదు, అయిస్టీన్ తెలీదు బిల్ గేట్స్ తెలీదు” అని.

ఆ గుడిసెలో ఒక రోజు గడుపుతాడు, వాన వెలిసాక బయలుదేరదామంటే ఆటోలు, బస్ లు ఏమీ ఉండవు. ఎలా వెళ్లాలి అని అడుగుతాడు ఒకతన్ని. “నడిచి” అని చెపుతాడు అతను.

“అవును, నడిచి పోవచ్చు కదా, రెండు కాళ్లున్న సంగతి, వాటితో నడవచ్చన్న సంగతి నాకు తోచలేదు” అనుకుంటాడు.

ఈ కథ లో నాకు బాగా నచ్చిన ఒక మంచి మాట ” మనిషి సుఖంగా ఉన్నప్పుడూ వ్యాపారం చెయ్యొచ్చు బాబు, కష్టంలో ఉన్నప్పుడూ వ్యాపారం చైకూడదు…”

వ్యాఖ్యానించండి