ఉగాది సినెమాకి వెళితే రాళ్లతో కొట్టాడు…[FULL]

మీలో ఎస్.వి.క్రిష్ణారెడ్డి తెలిసినవాళ్లూ తెలియని వాళ్లూ ఆయన హీరోగా నటించిన ఉగాది సినెమా చూసిన వాళ్లూ చూడని వాళ్లూ నా గురించి తెలిసినవాళ్లూ తెలియనివాళ్లూ మా శ్రవణ్ [నేను కాదు నా లాంటి పేరే పెట్టుకున్న ఒక వెధవ…] గాడి గురించి తెలిసినవాళ్లూ తెలియనివాళ్లూ అందరూ ఈ పోస్ట్ చదవచ్చు..కానీ చదివాక శ్రవణ్ గాన్ని తిట్టే హక్కు మాత్రం మీకు ఇవ్వట్లేదు..
ఎస్.వి.క్రిష్ణారెడ్డి “ఉగాది” సినెమా తీయటానికి కొన్ని సంవత్సరాలకి ముందు…
మా ఇంటి గేట్ చప్పుడయింది,బిలబిలమంటూ ముగ్గురు అబ్బాయిలు వాళ్ల అమ్మా నాన్నా మా ఇంటికి వచ్చారు.ఎవరా అని నేను ఆలోచిస్తుండగానే “మా కంపెనీలో పనిచేసే హరిబాబూ వాళ్ల పిల్లలు అని , నన్నూ నా తమ్మున్ని ఆ పిల్లలకి హ్యాండోవర్ చేసి తను ఎంచక్కా పెద్దవాళ్లని ఇంటిలో……..పలికి తీసుకు వెళ్లింది మా అత్తయ్య.
ఆ పిల్లలకి ఒక్కోదికి మధ్య వయసులో ఓ రెండెళ్లు తేడా ఉండిఉంటుంది…అలాగే వాళ్ల తిక్క కూడా…
చిన్నవాడు->తిక్క…
మధ్యవాడు -> తిక్క+తిక్క=అతితెలివి
పెద్దవాడు->తిక్క+తిక్క+తిక్క=పిచ్చి.
ఇలా మా దగ్గర లేని [అప్పటివరకూ లేని] కొన్ని క్వాలిటీస్ వాళ్ల దగ్గర ఉండటంతో నేనూ తమ్ముడూ వాళ్లతో ఆడుకోవటం స్టార్ట్ చేసాం….
కాసేపయ్యాక…
“నీకు రెండు రాళ్లని అతికించటం వచ్చా?” అడిగాడు పెద్దవాడు నన్ను చూస్తూ…
“రాదు” అన్నానునేను ఎంతో సిగ్గుపడుతూ…
సినెమాల్లో హీరోలాగా రెండుచేతులూ పైకెత్తి చిటికవేసాడు..వాడి ఇద్దరు తమ్ముళ్లు పరిగెత్తి రెండు మార్బుల్ స్టోన్ ముక్కలు తెచ్చారు..వాళ్ల అమ్మ హ్యాండ్ బ్యాగ్లోంచి.
వెంటనే పెద్దవాడు ఒక్కోటి ఒక్కో చేతిలో పట్తుకుని “ఆక్..తు” అని ఓ రాయి మీద ఉమ్మేసాడు వెంటనే వాడి తమ్ముళ్లు ఆ రాయి మీద ఉమ్మేసారు.వాడు ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి అటూ ఇటూ రుద్ది చూసావా అతుక్కున్నాయి అన్నాడు.
ఇంతలో మాఇంటిపక్కన ఉండే ఓ అక్క మాఇంటికి వచ్చింది,వెంటనే పెద్దవాడు నేను పెళ్లిచేసుకుంటే ఈమెనే చేసుకుంటా అన్నాడు.
“అమ్మా నేనే చేసుకుంట అన్నీ నీకేనా..మొన్న రైల్వేస్టేషన్ల ఎర్రలంగా అక్కని చూసి పెళ్లి చేసుకుంటా అన్నవుకదా! ఇప్పుడు ఈమెను నేను చేసుకుంటా” అన్నాడు మధ్యవాడు.మాటలు కాస్తా వాదన అయ్యింది,వాదన నుంచి కొట్టుకోవటం దాకా వచ్చింది.
ఒకడు కొడితే ఇంకోడు గిచ్చటం,ఒకడు కొడితే ఇంకోడు తన్నటం ఇలా వాళ్లు గొడవపడుతున్నా సరే ఓ మూలగా నిలబడి గొడవలోకి వెళ్లకుండా ఉన్న ఆ చిన్నవాడిని చూస్తే ముచ్చటేసింది.ఎలాగూ నా ఈడు వాడే కాబట్టి తొందర్లోనే మేం ఫ్రెండ్స్ అయిపోయాం.
అన్నట్టు వాడిపేరే శ్రవణ్.
రోజులు గడుస్తుంటే వయసుతోపాటు వాడి తిక్క కూడా పెరిగింది.చివరికి జనాలు వాన్ని తిక్క శ్రవణ్ అని పిలవటం మొదలుపెట్టారు.నాకు మత్రం వాడి తిక్క తిక్కని దాటి అయితెలివి దాకా పెరిగిందనిపించింది,కానీ నా అభిప్రాయం తప్పని వాడి తిక్క అతితెలివిని దాటి పిచ్చి దాకా పెరిగిందని నాకు తెలిసేలా చేసిన ఆ సంఘటనే “ఉగాది” సినెమా.
ఏదో కారణంతో ఒకరోజు మా కాలేజీ [ఇంటర్] మధ్యానం బంద్ చేసారు..
“ఎహె ఇట్ల మధ్యానం బంద్ చేస్తె తిక్క లేస్తదిరా” అన్నాడు వాడు..
“నీకు ఆల్రెడీ ఉంది కదారా” అని మనసులో అనుకొని అవ్..అవ్ అన్నా..
ఏం చేద్దాంరా సినెమాకి వెళదామా? అన్నాడు
సరే అన్నా
వాడు ” చూడు..సూపర్ ఎంజాయ్ చేద్దాం” అంటూ రోడ్డుపక్కన రాళ్లు తీసి జేబులో వేసుకున్నాడు..
అవెందుకురా అన్నా
“సూపర్ ఎంజాయ్ చేద్దాం” అన్నాడు
వాడి ప్రీవియస్ డైలాగ్ కి ఎకో అనుకున్న..
బ్లాక్ లో టిక్కెట్లు కొని మరీ లోపలికి వెళ్లాం..
ఒరేయ్ అన్నిటికన్నా వెనక రోలో కూచుందాం అన్నాడు

*******సినెమా స్టార్టయింది*************

సుధాకర్ కామెడీ వస్తోంది,థియేటర్ లో అందరూ నవ్వుతున్నారు వాడుతప్ప,వాడేమో ఒకటి..రెండూ..మూడు..అంటూ లెక్కపెడుతున్నాడు,కామెడి అయిపోతుంది అనే టైముకి జేబులోనుండి ఓ రాయితీసి ముందున్న జనాలలోకి విసిరేసాడు…
నాకు అర్ధంకాలేదు వాడేంచేసాడో..అర్ధమయ్యాక నా బుర్ర పనిచెయ్యలేదు,అలా విసిరేసేటైముకి కామెడీ సీన్ అయిపోయింది..వీడేమో గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు,ఆ రాయి తగిలినాయనేమో లేచి చుట్టూ చూస్తున్నాడు..చుట్టుపక్కల వాళ్లేమో వీడి నవ్వుకి మావైపుకి చూస్తున్నారు.
కంగారుగా “ఏం చేసావురా..ఏం చేస్తున్నావురా? ” అనడిగాను..
“ఉండురా సూపర్ ఎంజాయ్ చేద్దాం” అన్నాడు వాడు..

వామ్మో వీడు రాళ్లు తీసుకొచ్చింది ఇందుకా ఇదా సూపర్ ఎంజాయ్ అనుకుని..అరేయ్ నీకేమన్న పిచ్చా రాయి తగిలితే..దెబ్బ తగులుతది ఎందుకురా కొడుతున్నవ్ ఒద్దు అన్నా.

వెంటనే వాడు “సరే రాయితో ఒద్దా అయితే చాక్పీస్ తో కొడదాం” అని జేబులోంచి చాక్పీస్ తీసాడు.

“ఒద్దురా………………..” అంటుండగానే చాక్పీస్ ని బొటనవేలు కీ మధ్యవేలు కీ మధ్యనపెట్టి అలా గాల్లోకి విసిరాడు..

అదికాస్తా పైకి ఎగిరి..ప్రొజెక్టర్ లైట్లో మెరిసి ఓ ఆంటీ మీద పడింది,కాసేపు ఆ రో లో సందడి మొదలైంది.వాళ్లు వెనక్కీ పక్కకీ కాసేపు చూసారు.మళ్లీ సుధాకర్ కామెడీ మొదలయింది.అక్కడ కామెడీ సీన్ అయిపోగానే వీడు గట్టిగా నవ్వేవాడు రాయి విసిరి దాక్కో దాక్కో అనిసీట్లోంచి కిందకి దిగి కూచునేవాడు.ఒద్దురా పక్కన వాళ్లు చూస్తే మనకి పగలాల్సినవి పగులుతయి అన్న కానీ వాడు వినలేదు.

ఇక ఇలా కాదని,నేను వెళుతున్నా అని లేవబోయా..

వెంటనే వాడు సరే వెళ్లు నువ్వు వెళ్తుంటే అదిగో రాళ్లతో కొట్టి పోతుండు అని అరుస్తా ఆ పగలాల్సినవేవో నీకే పగులుతయ్ అన్నాడు.

ఈ గాడిదకొడుకు అన్నంతపనీ చేస్తాడని మూసుకుని ఇంటర్వెల్ వరకు ఉండి పరిగెత్తుకుంటూ థియేటర్ నుండి బయటకి వచ్చా.

ఆ తరవాత వారంలోనే వాళ్ల నాన్న వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడు.వీడుకూడా ఆ ఊరు వెళ్లిపోయాడు….

*******************ఓ పది సంవత్సరాల తరువాత******************************************

మా బంధువుల అమ్మాయి పెళ్లికి హైద్రాబాద్ వెళ్లాను అక్కడ తింటూ ఉంటే ఓ ఆలుగడ్డ ముక్క ఎగిరొచ్చి నాకు తగిలింది..ఎవడ్రా అని చూస్తే వీడు..శ్రవణ్ గాడు..ఏ రా?గుర్తుపట్టావా? అనడిగాడు.

నేను అన్నం తిన్నా..వాడు అన్నంతో పాటు నన్ను కూడా తిన్నాడు.

“అలా బయటికెళదాం రా రా” అన్నాడు

ఏం ఒద్దురా అన్నాను నేను.

“ప్లీజ్ రా” అన్నాడు వాడు

మనసులో ఏదో అనుమానంగా ఉన్నా వాడి వెంట వెళ్ళాను.వాడి కైనటిక్ హోండా తీసి ఎక్కు అన్నాడు.

రయ్ మని పరిగెత్తింది బండి.ధడేళ్ మంటూ స్పీడ్ బ్రేకర్ మించి ఎగిరింది బండి.

“నీ అమ్మ” అన్నాడు వాడు.

ఎవర్నిబే అన్నా నేను.

స్పీడ్ బ్రేకర్ని రా అన్నాడు.ఓ పాపం చూసుకోలేదేమో ఎగిరినందుకు కోపంగా స్పీడ్బ్రేకర్ ని తిడుతున్నాడు అనుకున్నా.

మళ్లీ ధడేళ్ ,మళ్లీ తిట్టు ఈ లూప్ ఇలా ఇంకో రెండు సార్లు నడిచాక మెళ్లగా ఎళ్లురా అన్నాను నేను.

“మెళ్లగా ఎళ్లటానికా నిన్ను ఎక్కించుకుంది?” అన్నాడు వాడు.నాకు వాడి లాజిక్ అర్థంకాక అదేంట్రా అన్నానునేను

“ఆ ఏంలేదురా ,నిన్న ఒక్కన్నే ఇదే రోడ్డు లో ఈ బండి వేసుకుని ఫుల్ స్పీడులో వస్తుంటే ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎగిరి పడ్డా నిన్న ఒక్కన్నే ఉన్న కదా అందుకే బండి ఎగిరింది బరువుంటే ఎగరదని నిన్ను రమ్మన్నా,ఉండు స్పీడ్ గా ఈ స్పీడ్ బ్రేకర్ల మించి నడిపించి కసితీర్చుకుంటా” అని ఓ అయిదు నిముషాలు బండి ఆపకుండా తిప్పుతూనే తిడుతూనే ఉన్నాడు వాడు

చివరికి బండి ఆగింది….

ఈ కథ కూడా ఆగింది….

ఆతరవాత ఎప్పుడూ నేను వాన్ని కలవలేదు..

కలవాల్సిన అవసరం ఉందంటారా?

స్పందనలు

  1. Krishna Palakollu Avatar

    బాగా రాస్తున్నారండి శర్మ గారు 🙂

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి