బానిస[నవల]-3′rd Episode.
http://rapidshare.com/files/202673814/__3116___3134___3112___3135___3128_.pdf.html
ముందు భాగాలు కూడా చదవాలనుకుంటే పి.డి.ఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి.
————————————————————————————–
‘కా’ అని అరుస్తూ వెళ్లింది ఓ కాకి.
తేరుకున్నాడు నల్లచిరుత,వేగంగా ఆలోచించటం మొదలుపెట్టింది అతని మస్తిష్కం.ఎదురుగా ఉన్నది ఎవరో తెలియకపోయినా తన శత్రువు అతనికీ శత్రువే అంటే అతను తనకు మిత్రునితో సమానం ఇపుడు అతన్ని గూడెంవాసుల నుండి రక్షించటం తన ధర్మం..ఈ ఆలోచన రాగానే పొదలో నుంచి బయటికొచ్చి వేగంగా ఆ ఆజానుబాహుడి వైపు పరిగెత్తసాగాడు.
చేతిలో విల్లు తో తనవైపు పరిగెత్తుకొస్తున్న ఆ నల్లచిరుతను చూడగానే ఆజానుబాహుడికి తన మీదకే వస్తున్నట్టనిపించింది అంతే కత్తి దూస్తూ పోరాటానికి సిద్దమయ్యాడు.
అది చూసి నల్లచిరుత దూరంగానే ఆగి అరవసాగాడు ” నేను నీ మిత్రున్ని,నువు చంపినవాడు నాకూ శత్రువే.నువ్వెవరో తెలీదు..కానీ నాతో రా సురక్షితమైన ప్రదేశానికి వెళ్దాం” అంటూ.
మిత్రున్ని అన్న మాట వినగానే ఆ ఆజానుబాహుడు తనని తాను మరచిపోయాడు..చంపేసాను..ఆ దుర్మార్గుడు నల్లచిరుతను..చంపేసాను..అంటూ అరవసాగాడు.
ఆ మాట వినగానే మొద్దుబారిపోయింది నల్లచిరుత మెదడు,అంటే ఇతను తననే చంపటానికి వచ్చాడా..చెతిలో రక్తం తో తదిసిన కత్తితో..ఆ ఆజానుబాహున్ని చూడగానే వెన్నులో వణుకు మొదలయింది..నరనరాల్లోకీ భయం ప్రవేశించింది.అంతే వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు.
ఆ ఆజానుబాహుడు కూడా ఈ కొత్తమిత్రుడు సురక్షిత ప్రాంతానికి తీసుకెళతాడని నల్లచిరుత వెనక పరిగెత్తసాగాడు..చేతిలో కత్తి తో..
ఇదంతా సరిగ్గా నాలుగు ఘడియలలో జరిగిపోయింది.
…………..
వాళ్లలా వెళ్లగానే పొదలోనుండి బయటికొచ్చాడు మాణిక్యుడు..అతను అక్కడికి సూరిగాడు చనిపోయిన తరువాత ఒక ఘడియకు వచ్చాడు వాళ్లను చూసి అక్కడే ఓ పొద మాటున నక్కాడు..
మాణిక్యుడు గూడెం వాసి..సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఓ గుహలో కలిసిన ఓ మాంత్రికుని దగ్గర తంత్రవిద్యలు నేర్చుకోవటం మొదలుపెట్టాడు..రెండు రోజుల క్రితం అతని గురువు మ్రుతసంజీవని నేర్పుతానని ఏదైనా కళేబరం పూర్తిగా తెమ్మని చెబితే అప్పటినుండి అడవిలో తిరుగుతున్నాడు,సగం తిని వదిలివేయబడ్డ చెవుల పిల్లులూ,పొట్ట చీల్చి పడేసిన జింకలూ తప్ప పూర్తి కళేబరం ఎక్కడా కనబడలేదు..చివరికి తనే ఓ జంతువును చంపి తీసుకెళదాం అనుకుంటుండగా వినపడిందో భయంకరమైన అరుపు..వచ్చి చూస్తే ఎవరో తల వేరై కొట్టుకుంటున్నారు..ఓ గుర్రం పరిగెత్తుతోంది..ఓ పొదలో నక్కి చూడసాగాడు….
నల్లచిరుత వెంట ఆ ఆజానుబాహుడు పరిగెత్తగానే బయటకు వచ్చాడు మాణిక్యుడు,వెళ్లి చూస్తే అది సూరిగాడి దేహం..పూర్తి కళేబరం..అది కూడా తన గూడెం వాసిది అంతే ఆలోచించాడు..మొండాన్ని భుజంపై,తలను చేతిలో పట్టుకొని అడవిలోకి మాయమయ్యాడు..
……………
పరిగెత్తుతూనే ఉన్నాడు నల్లచిరుత,వెనక ఆజానుబాహుడు..అలా కాసేపయ్యాక ఆజానుబాహుడు అరిచాడు “మిత్రమా!ఆగు” అని.
అది వినగానే తగ్గింది నల్లచిరుత భయం..అవును తనెవరో ఆజానుబాహుడికి తెలీదు..తననెందుకు చంపాలనుకున్నాడో తెలుసుకోవాలి అని ఆగాడు నల్లచిరుత….
[ఇంకాఉంది]
—————————————————–
ఏంటి నచ్చిందా అయితె ఎవరన్నా publisher ల address ఇవ్వండి వెళ్ళిచావగొడతా..నచ్చలేదా ఇంకా ఏమన్నా సలహాలిస్తారా..ఆ ఎవరో పిలుస్తున్నారు మళ్లా కలుస్తా..
బానిస[నవల]-2′nd episode
నీళ్లలో పడవ మెల్లగా కదులుతోంది.నల్లచిరుత ఆకాశంలో అప్పుడే వస్తున్న నక్షత్రాలను చూస్తూ కూర్చున్నాడు కాసేపట్లో చీకటిగా మారింది ఆకాశంలో చంద్రుడు,నక్షత్రాలు చూస్తూ అలాగే గంగదేవుడి ఒడిలో పడుకున్నాడు నల్లచిరుత.
——————*——————————–
హఠాత్తుగా మెలకువ వచ్చింది నల్లచిరుతకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు పలుచగా ఉన్నాయి తెలవారబోతోంది,దిగ్గున లేచి కూర్చున్నాడు చూస్తే తానొక రాయి మీద పడుకున్నాడు..ఇంతవరకూ కలా..రాత్రి తండ్రినే తలచుకుంటూ పడుకున్నాడు తను అందుకే తనకు ఆ కలే వచ్చిందనుకున్నాడు..మెల్లమెల్లగా జరిగిన విషయాలు జ్గాపకం రాసాగాయి తండ్రి గంగదేవుడు చనిపోయాక తాను గూడేనికి నాయకుడు కావటం మెల్లగా తనకు అయిన చెడు అలవాట్లు ఊరివాల్లముందు తననో మోసగాడిగా చూపెట్టి తన గూడేన్ని లాక్కున్న సూరిగాడు,అంతకన్నా ముఖ్యంగా తనని గూడెం నుంచి వెళ్లగొట్టేప్పుడు సూరిగాడు మాట్లాడినమాటలు పదే పదే గుర్తొస్తున్నాయి.
—————————–*—————————
ఆ రోజు తనని గూడెం నుండి వెలివేసిన తరువాత కొత్త నాయకుడు సూరిగాడు తనతో మాట్లాడాడు.
“సూరీ!ఏంటిదంతా,నువ్వే నా ఇలా చేసింది” అడిగాడు నల్లచిరుత.
“మార్పు సహజం మిత్రమా!” అన్నాడు సూరిగాడు,ఆ గొంతులో కసి,కోపం.
ఆశ్చర్యంగా చూస్తూఉండిపోయాడు నల్లచిరుత.
మళ్లీ మాట్లాడటం మొదలుతపెట్టాడు సూరిగాడు “మా నాన్నని మీ నాన్న చంపేసాడు అన్యాయంగా గూడేనికి రాజయ్యాడు అందుకే మీనాన్నని నేనే చంపేసా..నిన్ను చెడ్డవాడిగా చేసి వెలేసేలా చేసా ఇప్పుడు నేనే నాయకున్ని..పో గూడెంనుండి” అన్నాడు సూరిగాడు.
“మా నాన్న హంతకుడు కాడు,మీ నాన్న ని చంపలేదు” తనలో తాను గొనుగుతున్నట్టుగా అన్నాడు నల్లచిరుత చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన విషయాలు గుర్తొస్తుంటే…
—————————————-*————————–
లేచి నిల్చుని చూశాడు నల్లచిరుత దూరంగా ఒక గుర్రం మీద మనిషి వస్తూ కనిపించాడు,సందేహంలేదు వాడు సూరిగాడే అనుకున్నట్లుగానే ఒంటరిగా దొరికాడు అనుకున్నాడు నల్లచిరుత వారమ్నుంచి గూడెం దగ్గర్లోనే గుట్టల్లో కాపేసాడు నల్లచిరుత సూరిగాడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని,వాడు ఇప్పుడు కనిపించగానే వేగంగా గుట్ట మించి కిందకి పరుగుతీసాడు..దూరంగా ఉన్నాడు సూరిగాడు వాడు వచ్చే దారిలో ఓ పొదలో దాక్కున్నాడు నల్లచిరుత రాగానే వాన్ని చంపుదామని బాణం చేతిలో పట్టుకొని చూస్తున్నాడు.
సూరిగాడికి తనకి మధ్య ఎవరో స్త్రీ కనిపించింది,తనని చూస్తే తమ గూడెం దానిలా లేదు తలనిండా ముసుగు చేతిలో పెద్ద కర్ర పట్టుకొని వడివడి గా నడుస్తోంది మధ్య మధ్య వెనక్కి తిరిగి చూస్తోంది కానీ ఆ నడకలో ఏదో తేడా కనిపించింది నల్లచిరుతకు ఎవరో మగాడు నడుస్తున్నట్టు…
“టక్” గుర్రం కాళ్లు కింద తాకి గాల్లోకి లేచాయి,సూరిగాడి జుత్తు గాల్లో ఎగురుతోంది వాడి చూపు మాత్రం ఎదురుగా ఉన్న స్త్రీ మీదే ఉంది.
“భగవంతుడా!సూరిగాన్ని చంపి తను పారిపోతుంటే చూసి తనెటు పారిపోయాడో గూడెం వాళ్లకు చెపుతుందేమో” ఆలోచిస్తున్నాడు నల్లచిరుత.
సూరిగాడు ఆ స్త్రీ కి దగ్గరగా వచ్చాడు,ఏయ్ అంటున్నాడు.
ఊపిరి బిగపట్టి సిద్దంగా ఉన్నాడు నల్లచిరుత సమయం కోసం ఎదురుచూస్తూ.
ఆమెకు దగ్గరగా దగ్గరగా వస్తున్నాడు సూరిగాడు,మొహం మించి ముసుగు తీసింది ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు నల్లచిరుత ఆమె..కాదు కాదు అతను ఓ ఆజానుబాహుడు మీసాలు మెలితిరిగి ఉన్నాయి పొడవాటి జుత్తు,కానీ చీరలో ఎందుకున్నాడో అర్ధంకాలేదు నల్లచిరుతకి..
సూరిగాడు దగ్గరగా వచ్చాడు ఆ ఆజానుబాహుడికి,చేతిలో ఉన్న కర్ర నుంచి సర్రున కత్తిని లాగి వెనక్కి తిరిగాడు ఆ ఆజానుబాహుడు అప్పటికే దగ్గరకు వచ్చేసిన సూరిగాడు చేతిలో కత్తితో అతన్నలా చూడగానే గుర్రాన్ని తరిమాడు అది వెనకకాళ్ల మీద నిలబడింది భయపడలేదా ఆజానుబాహుడు తనుకూడా గాల్లోకి ఎగిరాడు అప్పుడే గుర్రం కిందకి వస్తోంది సరిగ్గా సూరిగాడు కత్తికి ఎదురుగా రాగానే విసిరాడు కత్తిని తెగిపడింది వాడి తల ఆ ఆజానుబాయుడి కేక కి భయపడ్డ గుర్రం వెనక్కి తిరిగి గూడెం కేసి పరిగెత్తింది తల మొండెం వేరై సూరిగాడు పడిఉన్నాడు.
ఊపిరిపీల్చటం కూడా మర్చిపోయి చూస్తున్నాడు నల్లచిరుత….[ఇంకా ఉంది]
————————————————————
ఏంటి నచ్చిందా అయితె ఎవరన్నా publisher ల address ఇవ్వండి వెళ్ళిచావగొడతా..నచ్చలేదా ఇంకా ఏమన్నా సలహాలిస్తారా..ఆ ఎవరో పిలుస్తున్నారు మళ్లా కలుస్తా..
బానిస– నేను రాస్తున్న నవల
నింగి నేలా ఏకమైనట్టుగా ఒకటే వాన…మెరుపు మెరిసినప్పుడల్లా ఆ వెలుగులో ప్రకామ్యుడు భయంకరంగా అగుపించసాగాడు.అతని చేతిలోని ఖడ్గం నుంచే ఆ మెరుపు వచ్చిందేమోఅన్నట్లు..అతని అరుపే ఉరుమైనట్లుంది..అతని ఖడ్గధాటికి తెగిపడ్డ అవయవాలతో ఆ ప్రదేశంనిండిపోయింది,రక్తం తో తదిసిన వాన నీరు కాల్వలై ప్రవహిస్తోంది.ప్రకామ్యుడు ఈ నరమేధంమొదలుపెట్టి రెండురోజులయింది.శత్రురాజ్యం పై దండెత్తి అడ్డువచ్చిన వాళ్లనళ్లా చంపుతూవెళుతున్నాడు అసలే పరాక్రమవంతుడు ఆపై దేవీఉపాసకుడు మంత్రతంత్రనేర్పరి అయినప్రకామ్యుడు,ఇక అతనివెంట నడుస్తున్న సైనికుల ఉత్సాహానికి ఆగడాలకీ అడ్డేలేదు..విజయంవారిదే అన్నట్లు సాగుతున్నారు వాళ్లు.
అలా అలా సాగుతూ సాయంత్రం అయ్యే సరికి ఒక ముని ఆశ్రమం దగ్గరకి వచ్చారు.
“ఏం చెయ్యమంటారు ప్రభూ?” అడిగాడు సేనాపతి.
“దా..డి..చె..య్యం..డి..” ప్రకామ్యుడు ఆదేశం ఇస్తూనే అశ్వాన్ని ఉరికించాడు ఆశ్రమం వైపు.
ఆవేశం వివేకాన్ని చంపేస్తుంది..అందుకే మునులంటే ఎంతో భక్తి ఉన్న ప్రకామ్యుడు వారి మీదకే దాడికి వెళ్లాడు.
“ఏమిటీ ఆగడం?” అని అడగబోతున్న మాట కూడా బయటకి రాకుండానే రెండుగా తెగింది ఓ ముని శరీరం.క్షణాల్లో ఆర్తనాదాలతో నిండిపోయిందా ప్రాంగణం.
అది సిద్దేంద్ర ముని ఆశ్రమం..సర్వేంద్రియాలనూ జయించి బ్రహ్మవరప్రసాదియై లోక క్షేమం కోసం తపస్సు చేసే ముని అతను..సరిగ్గా ఆ ముని కుటీరం రాగానే గుర్రాన్ని దిగి లోపలికి పరిగెత్తి అతన్ని చంపటానికి కత్తి పైకెత్తాడు ప్రకామ్యుడు..
అంతే..
కళ్లు తెరచిన ముని కళ్లలోకి చూసి అలాగే ఆగిపోయాడు..ఎప్పుడూ చూడని దివ్యతేజస్సుకి మైమరచి చూస్తూ ఉండిపోయాడు.బయట నిలబడ్డ సేనాపతి కంగారుగా లోపలికి రాబోతే వారించాడు ప్రకామ్యుడు,ద్వారం దగ్గరే నిలబడి చూస్తున్నాడు సేనాపతి.
“ఎందుకు మా మీద దాడి చేస్తున్నావు?” అడిగాడు ముని.
“నేను మీ రాజ్యం మీద దాడి చేస్తున్నాను,అందుకు” చెప్పాడు ప్రకామ్యుడు.
“చంపండి మహారాజా” వెనకనుంచి అరుస్తునాడు సేనాపతి,అతను కేవలం సేనాపతి మాత్రమే కాదు అతని గురువు కూడా.
“రాజ్యం ఏడుతరాలు,ధనం మూడు తరాలు మాత్రమే నిలుస్తాయని తెలీదా,ఎందుకీ మ్రుత్యుక్రీడ” అడిగాడు ముని.
“రాజ్యం వీర భోజ్యం అని మాత్రమే తెలుసు” అన్నాడు ప్రకామ్యుడు.
“వద్దు వెళ్లిపో!ప్రశాంతంగా నీ రాజ్యాన్ని ఏలుకో..కోరి నీ నాశనాన్ని తెచ్చుకోకు” చెప్పాడు ముని.
ఆ మాటలు వింటున్న సేనాపతి కోపంగా వచ్చి మునిని చంపటానికి కత్తి ఎత్తాడు.
ఒక్కసారి..ఒకేసారి..చూసాడు ముని సేనాని వైపు,మళ్లీ లోకాన్ని చూడడానికి లేకుండా మాడి మసైపోయాడు సేనాని. సేనాని మరణాన్ని చూస్తూనే ప్రకామ్యుడి కోపం హద్దులు దాటింది,భయంకరంగా అరుస్తూ ముని పైకి కత్తి ఎత్తాడు..
ప్రకామ్యుడి అరుపు విన్న సైనికులు కుటీరం లోకి చూసేసరికి రాయిలా మారిన ప్రకామ్యుడు కనిపించాడు..పక్కన కోపంగా ముని..అంతే అరుస్తూ పారిపోయారు.
అలా వెళ్లినవాళ్లు మళ్లీ రెండవరోజు కళ్లా ఆశ్రమానికి వచ్చారు,ఈ సారి వాళ్లతో పాటు రాజమాత కూడా ఉంది..ఆశ్రమంలోకి అడుగుపెడుతూ అక్కడి పరిస్తుతుల్ని చూడగానే ఆమెకు అర్దమైంది ప్రకామ్యుడెంత పెద్ద తప్పు చేశాడో.
వెంటనే వెళ్లి ముని కాళ్లపై పడ్డది,క్షమించి పుత్రుని మళ్లీ మామూలుగా మార్చమన్నది.
అప్పుడు ముని అన్నాడు “తల్లీ!నీ కుమారుడి మనసు పాషాణం.అందుకే మొత్తంగా పాషానంగా మార్చాను,కానీ అడుగుతున్నావు కాబట్టి చెపుతున్నాను అతని మనసు కరిగి అతను ఏడ్చినప్పుడు మళ్లీ మామూలుగా మారుతాడు కానీ స్వార్దంతో కూడిన ప్రయత్నాలవల్ల అతను ఏడవడు” అని చెప్పాడు ముని.
ఆ రోజు నుండి ఆ తల్లి అతన్ని ఏడిపించాలని చెయ్యని ప్రయత్నం లేదు..ఆ విగ్రహం ముందే ఏడుస్తూ కూర్చునేది ప్రకామ్యుడు ఎంత బాధ పడ్దా అతను మారాలనే కోరిక ఆ తల్లి లో ఉండడం వల్ల అతను మామూలుగా మారలేదు..ఆమె అలా ఏడుస్తూ ..ఏడుస్తూ..ఏడుస్తూనే ఉంది..” ఆ కన్నీళ్ల వల్లే ఈ ఏరు ఏర్పడ్డది అందుకే దీన్ని “అమ్మఏరు” అంటారు ..చెప్పాడు గంగదేవుడు నీళ్లు తాగుతున్న నల్లచిరుత తో….
“మరి ఆ రాయి ఏది?” అడిగాడు నల్లచిరుత.
గంగదేవుడికి చిన్నప్పుడు తను కూడా గుట్టల్లో ఆ విగ్రహం కోసం వెతికిన రోజులు గుర్తొచ్చాయి!ఎప్పటి నుంచో వస్తున్న కథ అది తనకు తన తల్లితండ్రులు చెప్పారు,ఇప్పుడు తను తన కొడుక్కి చెపుతున్నాడు..
గంగదేవుడు ఓ చెంచుగూడేనికి రాజు అంతే కాదు ఆ చుట్టుపక్కల ఇంకొన్ని గూడేలు,పల్లెలపై కూడా ఆజమాయిషీ అతనిదే చెప్పలంటే సుమారుగా అతను ఆ ప్రాంతానికి రాజు..
“వెళదాం పద!” అన్నాడు గంగదేవుడు నల్లచిరుతకి ఏం చెప్పాలో తెలీక..
“సూరీ,పడవ నీళ్లలోకి తొయ్యి!” చెప్పాడు గంగదేవుడు.
“సరే దొరా!” అన్నాడు సూరిగాడు.
పడవలోకి వెళ్లి కూర్చున్నారు గంగదేవుడు,నల్లచిరుత పడవని నీళ్ల లోకి తోసి ఎగిరి పడవలో కూర్చున్నాడు సూరిగాడు.
మొదలయింది వాళ్ల ప్రయాణం…………[ఇంకా ఉంది]
—————————————————–
ఏంటి నచ్చిందా అయితె ఎవరన్నా publisher ల address ఇవ్వండి వెళ్ళిచావగొడతా..నచ్చలేదా ఇంకా ఏమన్నా సలహాలిస్తారా..ఆ ఎవరో పిలుస్తున్నారు మళ్లా కలుస్తా..
-
ఖజానాలు
- ఏప్రియల్ 2012 (1)
- డిసెంబరు 2011 (3)
- అక్టోబర్ 2011 (1)
- జులై 2011 (1)
- మే 2011 (2)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (1)
- నవంబరు 2010 (8)
- అక్టోబర్ 2010 (2)
- జులై 2010 (1)
- జూన్ 2010 (2)
- మే 2010 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
