అనంతమైన ఆలోచనలు

నా ఆలోచనలు..నా దారి…

ఆ నిమిషం వెనక్కి వెళ్లకుంటే ఈ బాధ ఉండకపోయేది…….

భువనగిరి బస్టాండ్ లో దిగి ,సరే ఫోన్ చేయలేదని నిన్నటినుండి కల్యాణ్ గాడు తిడుతున్నాడు కదా అని ఓ మూల నిలబడి ఫొన్ డయల్ చేసి వాడు లిఫ్ట్ చేయడం కోసం వైట్ చేస్తూ చుట్టూ చూస్తూఉంటే ఓ ముసలావిడ నా వైపే చూస్తూ వచ్చి నా పక్కన నన్నే చూస్తూ నిలబడింది,

అబ్బా ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటారు అనుకుంటూ నే ఆమె వైపు చూస్తే చేతిలో ఓ చిన్న బుక్ పట్టుకుని ఉంది,ఓహో ఫ్రీ ఫొన్ కాల్ కావాలేమో అనుకుంటునే కల్యాణ్ గాడు లిఫ్ట్ చేయకపోవడంతో కాస్త చికాగ్గా ఉన్న నా దగ్గరకి వచ్చి

“జరంత  గీ నెంబర్ కి కొట్టవ బిడ్డా” అన్నదా ముసలావిడ,

“నా దాంట్ల డబ్బులు లేవమ్మా,ఇగో ఈ అయిదు రూపాయలు తీసుకుని బయట చేసుకోపో” అన్నా

“ఒద్దు బిడ్డా,డబ్బులున్నయి బస్సు గజ్వెల్లి ది పోతదేమో నాకీ ఫోన్లు చేసుడు రాదు,నా కొడుక్కి నేను ఒస్తున్నా అని చెప్పలి” అంది

సరే అని వెనక్కి తిరగి వస్తూ,అనవసరంగా అబద్దం చెప్ప అనుకుంటూ వెనక్కి తిరిగి

“ఆగమ్మా ఒస్తున్నా ” అని ఆమెతో పాటు వెళ్లా…..

చేతిలో ఒక చిన్న గుడ్డ సంచీ,ఊరికి పోయినప్పుడు కట్టుకోవటానికి పక్కకి పెట్టుకున్న ఓ చీర కట్టుకుని ఉంది.

కాయిన్స్ తీసుకు డయల్ చేసి ఎల్లయ్యా ఇగో మీ అమ్మ మాట్లాడుతదట అని ఇచ్చా……

ఆమె మాట్లాడుతూ ఉండటం అబ్బాయి ఫోన్ పెట్టెయ్యటం మళ్లీ చేయటం ……..

తన కొడుకు గజ్వెల్ నుండి హైద్రాబాద్ పోయి ఆరు నెలలు అవుతోందట ,చప్పకుండ ఎందుకొచ్చినవ్,ఇప్పుడు ఎట్ల ఒచ్చి తీస్కపోత ఇంటికి పో అన్నాడు…..

తను చెప్పేదీ సబబుగానే అనిపించింది.

ఫోన్ చేసి రావచ్చు కదమ్మా,అతను మాత్రం ఏం చేస్తాడు అన్నా,

తను ఏమీ మాట్లాడలేదు ఏదో గొణుక్కుంటు ఉంది….

సరే ఇప్పుడు ఏం చేస్తావ్ అనడిగా..

ఏముంది బిడ్డా పొమ్మన్నడు ఇక్కన్నా ఎవ్వరు లేరు ఇగ మళ్లా వరంగల్ పోతె నా అక్క బిడ్డ దగ్గరుంట,

అన్నది.

సరే రా అని బస్టాండ్ లోకి వెళుతూ,సరే ఎందుకొచ్చినవ్ అనడిగా

“రెండు సంవత్సరాల కింద ఎడమ కాలికి పక్శవాతం ఒచ్చింది,ఇప్పుడు కొంచం నయం ,దానికే మందుల కోసం ఒచ్చిన ,పో వాడు చూపెడుతడు అని వాళ్ల నాయిన అన్నడు ,ఒస్తెనేమో వీడు గిట్ల చేసిండు అంటు ఏడుపు మొదలు పెట్టింది.

గా ఎల్.ఐ.సి పిలగాడు మీ కొడుకు గజ్వెల్ లోనే ఉన్నడన్నడు ,వీడేమో హైద్రాబాద్ పోయి ఆరు నెలెలయిందట కనీసం చెప్పలే అన్నది

ఏంటి నీ కొడుకు ఆరు నెలలనుండి హైద్రాబాద్ ల ఉంటే నీకు తెల్వదా అన్న

అడ్డాల నాడు బిడ్డలు గానీ గడ్డాల నాడు బిడ్డలైతరా,రెక్కలోచ్చినయి ఎగిరిపోయిండు అన్నది….

చుట్టు చూస్తారన్న ఆలోచనో ఏమో తనలో తానే ఏడుస్తా కూచుంది…

అప్పటికి టైమ్ ఏడున్నర,తను వెళ్లే సరికి దాదాపు పదకొండు అవుతుంది

ఎప్పుడు తిన్నవమ్మా అంటె పొద్దున పదకొండుకి అంది,

రామ్మా తినేసి వద్దాం నేను బస్ ఎక్కిస్తా అంటే వద్దు అన్నది

సరే అని వంద ఇచ్చా ముందు తీసుకోను అన్నది,ఎంతో నచ్చచెప్పితే తీసుకుంది,

నేను కల్యాణ్ గాడి ఫోన్ వస్తే బయటకి వెళ్లి మాట్లాడి వచ్చేంతలో తను వెళ్లిపోయింది,బస్ ఎక్కి….

తనకి కాస్త తినిపిచ్చి బస్ ఎక్కిస్తే సంతషంగా ఉండేది….

ఎవరుబై ప్రపంచం ఓ ఊరులా మారింది అన్నది,

ఊర్లల్ల గూడ ప్రపంచాలున్నై….ఎవ్వరి ప్రపంచం వాళ్ళకి……..కొంచం తొంగి చూస్తె కనబడతై………

డిసెంబరు 19, 2011 Posted by | అనంతమైన ఆలోచనలు.. | అభిప్రాయములు

   

Follow

Get every new post delivered to your Inbox.