అనంతమైన ఆలోచనలు

నా ఆలోచనలు..నా దారి…

ఆ నిమిషం వెనక్కి వెళ్లకుంటే ఈ బాధ ఉండకపోయేది…….

భువనగిరి బస్టాండ్ లో దిగి ,సరే ఫోన్ చేయలేదని నిన్నటినుండి కల్యాణ్ గాడు తిడుతున్నాడు కదా అని ఓ మూల నిలబడి ఫొన్ డయల్ చేసి వాడు లిఫ్ట్ చేయడం కోసం వైట్ చేస్తూ చుట్టూ చూస్తూఉంటే ఓ ముసలావిడ నా వైపే చూస్తూ వచ్చి నా పక్కన నన్నే చూస్తూ నిలబడింది,

అబ్బా ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటారు అనుకుంటూ నే ఆమె వైపు చూస్తే చేతిలో ఓ చిన్న బుక్ పట్టుకుని ఉంది,ఓహో ఫ్రీ ఫొన్ కాల్ కావాలేమో అనుకుంటునే కల్యాణ్ గాడు లిఫ్ట్ చేయకపోవడంతో కాస్త చికాగ్గా ఉన్న నా దగ్గరకి వచ్చి

“జరంత  గీ నెంబర్ కి కొట్టవ బిడ్డా” అన్నదా ముసలావిడ,

“నా దాంట్ల డబ్బులు లేవమ్మా,ఇగో ఈ అయిదు రూపాయలు తీసుకుని బయట చేసుకోపో” అన్నా

“ఒద్దు బిడ్డా,డబ్బులున్నయి బస్సు గజ్వెల్లి ది పోతదేమో నాకీ ఫోన్లు చేసుడు రాదు,నా కొడుక్కి నేను ఒస్తున్నా అని చెప్పలి” అంది

సరే అని వెనక్కి తిరగి వస్తూ,అనవసరంగా అబద్దం చెప్ప అనుకుంటూ వెనక్కి తిరిగి

“ఆగమ్మా ఒస్తున్నా ” అని ఆమెతో పాటు వెళ్లా…..

చేతిలో ఒక చిన్న గుడ్డ సంచీ,ఊరికి పోయినప్పుడు కట్టుకోవటానికి పక్కకి పెట్టుకున్న ఓ చీర కట్టుకుని ఉంది.

కాయిన్స్ తీసుకు డయల్ చేసి ఎల్లయ్యా ఇగో మీ అమ్మ మాట్లాడుతదట అని ఇచ్చా……

ఆమె మాట్లాడుతూ ఉండటం అబ్బాయి ఫోన్ పెట్టెయ్యటం మళ్లీ చేయటం ……..

తన కొడుకు గజ్వెల్ నుండి హైద్రాబాద్ పోయి ఆరు నెలలు అవుతోందట ,చప్పకుండ ఎందుకొచ్చినవ్,ఇప్పుడు ఎట్ల ఒచ్చి తీస్కపోత ఇంటికి పో అన్నాడు…..

తను చెప్పేదీ సబబుగానే అనిపించింది.

ఫోన్ చేసి రావచ్చు కదమ్మా,అతను మాత్రం ఏం చేస్తాడు అన్నా,

తను ఏమీ మాట్లాడలేదు ఏదో గొణుక్కుంటు ఉంది….

సరే ఇప్పుడు ఏం చేస్తావ్ అనడిగా..

ఏముంది బిడ్డా పొమ్మన్నడు ఇక్కన్నా ఎవ్వరు లేరు ఇగ మళ్లా వరంగల్ పోతె నా అక్క బిడ్డ దగ్గరుంట,

అన్నది.

సరే రా అని బస్టాండ్ లోకి వెళుతూ,సరే ఎందుకొచ్చినవ్ అనడిగా

“రెండు సంవత్సరాల కింద ఎడమ కాలికి పక్శవాతం ఒచ్చింది,ఇప్పుడు కొంచం నయం ,దానికే మందుల కోసం ఒచ్చిన ,పో వాడు చూపెడుతడు అని వాళ్ల నాయిన అన్నడు ,ఒస్తెనేమో వీడు గిట్ల చేసిండు అంటు ఏడుపు మొదలు పెట్టింది.

గా ఎల్.ఐ.సి పిలగాడు మీ కొడుకు గజ్వెల్ లోనే ఉన్నడన్నడు ,వీడేమో హైద్రాబాద్ పోయి ఆరు నెలెలయిందట కనీసం చెప్పలే అన్నది

ఏంటి నీ కొడుకు ఆరు నెలలనుండి హైద్రాబాద్ ల ఉంటే నీకు తెల్వదా అన్న

అడ్డాల నాడు బిడ్డలు గానీ గడ్డాల నాడు బిడ్డలైతరా,రెక్కలోచ్చినయి ఎగిరిపోయిండు అన్నది….

చుట్టు చూస్తారన్న ఆలోచనో ఏమో తనలో తానే ఏడుస్తా కూచుంది…

అప్పటికి టైమ్ ఏడున్నర,తను వెళ్లే సరికి దాదాపు పదకొండు అవుతుంది

ఎప్పుడు తిన్నవమ్మా అంటె పొద్దున పదకొండుకి అంది,

రామ్మా తినేసి వద్దాం నేను బస్ ఎక్కిస్తా అంటే వద్దు అన్నది

సరే అని వంద ఇచ్చా ముందు తీసుకోను అన్నది,ఎంతో నచ్చచెప్పితే తీసుకుంది,

నేను కల్యాణ్ గాడి ఫోన్ వస్తే బయటకి వెళ్లి మాట్లాడి వచ్చేంతలో తను వెళ్లిపోయింది,బస్ ఎక్కి….

తనకి కాస్త తినిపిచ్చి బస్ ఎక్కిస్తే సంతషంగా ఉండేది….

ఎవరుబై ప్రపంచం ఓ ఊరులా మారింది అన్నది,

ఊర్లల్ల గూడ ప్రపంచాలున్నై….ఎవ్వరి ప్రపంచం వాళ్ళకి……..కొంచం తొంగి చూస్తె కనబడతై………

డిసెంబరు 19, 2011 Posted by | అనంతమైన ఆలోచనలు.. | అభిప్రాయములు

ఈ సి.ఐ గారికి పుస్తకాలంటే చాలా ఇష్టం……….

విజయ్ కుమార్ గారు సిద్దిపేట సి.ఐ గా పనిచేస్తున్నారు,వీరితో ఈ  పరిచయం అనుకోకుండా జరిగింది.
సిద్దిపేట లో ఒక ఫ్రెండ్ ఉన్నారు పేరు బాలలింగం,ఇతనికి బస్టాండ్ దగ్గర “రాజ్ బుక్స్” షాప్ ఉంది,ఇతను మంచి పుస్తక ప్రియుడు,షాప్ లో కూడా పుస్తకాలని చాలా బాగా మైన్టైన్ చేస్తారు.అన్ని రకాల పుస్తకాలు అక్కడ ఉండేలా జాగ్రత్త తీసుకుని సంపాదన మీద కాకుండా పుస్తక ప్రియులని అలరించేలా షాప్ ని రన్ చేస్తున్నారు.
మొన్న ఒక రోజు కొత్త పుస్తకాలు ఏమొచ్చాయో చూడడానికి వెళ్లినప్పుడు అక్కడికి వచ్చారు సి.ఐ గారు,
అసలు ఎంత సరదాగా కలిసి పోయారంటే కొత్తగా అప్పుడే పరిచయం అయినట్టే అనిపించలేదు,పైగా సి.ఐ అన్న ఫీలింగ్ కూడా లేకుండా ఆ ఫీలింగ్ నాకు కనీసం రానీయకుండా కలిసిపోయారు.
సార్ తో మాట్లాడడం ఒక పుస్తకం చదవటంతో సమానం,ఆయన ఉద్దేశ్యంలో మనిషి ఎప్పుడయినా చేసుకోగలిగిన అలవాటు ,మంచి అలవాటు పుస్తక పటనం,
“Teaching without Learning,Learning without Teaching”
అంటూ కొటేషన్స్ తో మాట్లాడారు,వారి మాటలు వింటుంటే మీ అందరికీ పరిచయం చేయాలనిపించి
“సార్!ఒక రోజు మీరు టైమ్ ఇవ్వాలి,మీ ఇంటర్వూ కావాలి” అన్నాను.
అప్పుడాయన పర్లేదు ఇప్పుడు మాట్లాడుకుందాం అని అన్నారు…..
మీరు చూడబోయే వీడియో నేను ఆయనతో మాట్లాడిన మాటలు…
ఆయన ఎంత ఓపెనో మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది..

ఆయన గురించి బయట నను తెలుసుకున్న వియం ఏమిటంటే ,ఎవరయినా చిన్న చిన్న గొడవలు అలా స్టేషన్ కి వచ్చిన వాళ్లు ఉంటే వాళ్లకు కౌన్సిలింగ్ చేసి కొన్ని పుస్తకాలను చదవమని సూచించి,వాళ్లను చదివించి వాళ్లలో మార్పు తేవటానికి ట్రై చేస్తారని తెలిసింది.

ఆయనకి వృత్తిలో నూ , మానసికంగానూ ఎప్పుడూ సంతషం కలగాలని కోరుకుంటున్నాను.

చదివినందుకు మీ అందరికీ కృతజ్ణతలు…….

కింద ఫోటోలో్ నేనూ,సి.ఐ గారూ,మా బాలలింగం అన్న…..

డిసెంబరు 18, 2011 Posted by | అనంతమైన ఆలోచనలు.. | అభిప్రాయములు

పోయిన ఆదివారం ఫోటోల పండగ చేసుకున్న….!!!!!!

మొన్న ఆదివారం పొద్దున్నే పదింటికళ్లా నిద్ర లేద్దామనుకుంటుండగా మా నాన్న ఎవరినో తిట్టడం వినిపించింది,ఎందుకయినా మంచిదని ఎవరిని తిడుతున్నాడో విందామని చూస్తే ,

“అసలు బుద్ది ఉండదా ఇల్లన్నప్పుడు పని చేయాలని తెలీదా,ఇలా అయితే ఇక బానే” అని తిడుతూ ఉన్నాడు….

మేము కొత్త ఇళ్లు కట్టుకుంటున్నాం లెండి,మేస్త్రీ లు రాలేదేమో తిడుతున్నాడు అనుకుని,

లేచి….

పరిగెత్తుకుంటూ వెళ్లి….

“అవును అసలు ఇంత భాధ్యత లేకుండా ఎలా ఉంటారో,పని అనుకున్నాక చెయ్యలి …….” అనేదో అంటుంటే వెనక నుండి మా తమ్ముడు ష్…. అని సైగ చేసాడు…….

నాన్న ఇంకా కోపంగా మారాడు……

అప్పుడు అర్థమయింది,నాన్న తిడుతోంది నన్నని…….

నా అద్రుష్టం బాగుండి,ఆదివారం కూడా మా నాన్నకి స్కూల్ ఉంది……

ఎలా అయినా నాన్న దగ్గర ఇంప్రెషన్ కొట్టెయ్యాలని గోడ నేనే కడతా అని స్టార్ట్ చేసా…..

హమ్మయ్య….ఒక థీమ్ సెట్ చేసా కదా ,ఇక ఫోటో సెషన్…….


ఏం తీస్తవ్,కాసేపాగు ఓ గొప్ప గోడ కడ్త……….

అయినా గోడ కట్టాలంటే ముందు ఉన్న గోడని కూలగొడితె అయిపోతది,ఒకవేళ నేను బాగా కడితే క్రెడిట్ ముందు కట్టినోడికి కూడా పోతది……

ముందు మనకి ఇటుక పగలగొట్టడం ఒస్తదో రాదో చూద్దాం……

అమ్మో ఒకచేతుల ఇటుక ఇంకో చేతుల తాపె పట్తుకుంటె జిమ్ ల ఎక్సర్సైజ్ చేసినట్టుంది…..

అవ్ గాని ,ఒక్క ఇటుకకే ఇంత కష్టం గా ఉంది,ఏ గోడ నా మొఖానికి అవసరమా,ఎట్లైనా తప్పించుకోవాలె..

..

దీనికన్నా సదువుకునుడే నయం,ఏ ఎవరయ్యా నా పుస్తకాలు అక్కడ పడేసింది….ఉండండి వస్తున్న…..

ఏ ఎందుకు బై ఫోటోలు తీసి ఇజ్జత్ తీస్తవ్……..!!!!!!
———————————————————————
సాయంకాలం ఈ ఫోటోలు చూసాక నాన్న నవ్వాడని స్పెషల్ గ చెప్పాల్నా……..:)

సరే ఇగ ఉంట మరి………

డిసెంబరు 16, 2011 Posted by | ఏదో సోది | అభిప్రాయములు

నేను..నాన్న…ఓ ప్రయాణం……..

“వాడు వస్తాడేమో అడుగు,రాకపోయినా నేను ఒక్కన్నే వెళతానులే” అన్నాడు నాన్న అమ్మతో, నాకు వినపడేటట్టుగా!
నాన్న ఆ రోజు తను చిన్నప్పుడు చదువుకున్న స్కూలుకి వెళుతున్నాడు ఏవో సర్టిఫికేట్స్ కావాలని.ఆ స్కూలు ఉన్న వూరు మేము ఉంటున్న వూరికి ఇరవై కిలోమీటర్లు.నాన్న చిన్నప్పుడు మా వూరిలో స్కూల్ లేదట అందుకే చుట్టాలింట్లో ఉంటూ వేరే వూరిలో చదువుకున్నాడట.[నాన్న చిన్నపటి విషయాలు ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు].
“ఏంటి, వస్తావా?” నాన్న ఈ సారి నన్నే అడగడంతో ఏవో ఆలోచనల్లో ఉన్న నేను కంగారుగా లేచి వస్తానన్నాను.
దూసుకుపోతోంది ’హీరోహోండా’! మమ్మల్ని పట్నపు శివారులోంచి పల్లెల వైపుకు తీసుకెళుతూ. “ఇదే మన దగ్గర కొత్తగా కడుతున్న డామ్” అని రోడ్డుకు కుడివైపు చూపించాడు నాన్న.అటువైపు చూస్తే ఒక పెద్ద మట్టికట్ట రెండు గుట్టల మధ్య ,దాని దగ్గరే పనిచేస్తూ మనుషులు మెషీన్లూ కనిపించాయి.
ఇంకా కొన్ని కిలోమీటర్లు వెళ్లాక మొత్తం పచ్చగా చెట్లు,ఎత్తయిన ప్రదేశాలు ఏటవాలు భూమి,ఆ భూమిలోనే వ్యవసాయం…అలాంటి ఏటవాలు భూమిలో వ్యవసాయం కూడా టెక్నికల్ వర్కే అనిపించింది.రోడ్డు రెండువైపులా పచ్చటి గోడలా రకరకాల చెట్లు …ఆ దారి చూసి ముచ్చటేసింది…అంతే……
ఈ సారి హీరోహోండా స్పీడ్ ఇంకాస్త పెరిగింది,ఇప్పుడు నడుపుతోంది నేను మరి!! ఆ పచ్చటి చెట్ల మధ్య నల్లటి రోడ్డు వంపులలోంచి పరుగులు తీస్తోంది బండి…
“ఇదిగో ఇక్కడే నేను మొన్న ట్రాన్స్-ఫర్ కాకముందు పని చేసిన బడి” అన్నాడు ,అటువైపు చూస్తే ఒక రూమ్ అనుకుంటా కనిపించింది.అది ఒక తండా మా బండి బడి దగ్గరకు వస్తుండగానే పరిగెత్తుకొచ్చారు పిల్లలు,ఆ వెనకే ఒక కొత్త వ్యక్తి బహుశా కొత్త మాష్టారనుకుంటా.
“బాగుండ్రా సర్!ఎందుకొస్తలేరు?” కాస్త విచిత్రమైన యాసలో అడిగిందొక పిల్ల.
పిల్లలతో కొత్త సార్ తో మాట్లాడి మళ్లీ మేం బయలుదేరాం. నాన్న బండి సౌండ్ విని పిల్లలు బయటకి రావడం సార్ కి ఆశ్చర్యమేమో గాని నాన్న గురించి తెలిసిన నాకేం ఆశ్చర్యం?.
మళ్లీ మొదలయింది మా ప్రయాణం వేగంగా పరుగులు తీస్తోంది మా బండి,అలాంటి వాటికోసమే అన్నట్లు ఎదురొచ్చింది స్పీడ్ బ్రేకర్.
“మెల్లిగా” అన్నాడు నాన్న.
“సరే” అని బ్రేక్ మీద కాలువేసి తొక్కాను,కానీ రోడ్డుమీద ఇసుక ఉండటం వల్ల వెనక టైర్ జారింది,ఎలాగో కిందపడెయ్యకుండా దాటించాను.
“బుద్దిలేదు పని చేసాక ఇసక తియ్యకుండా వదిలేసారు” నాన్న నా దగ్గరనుండి బండి తీసుకున్న కోపం అక్కడ ఇసక పోసిన వాళ్లపై చూపించాను వాళ్లెవరో తెలియకపోయినా.
“పక్కవాడి బాధ్యతని ప్రశ్నించే ముందు నీ విధిని నువ్వు తెలుసుకో” అయినా నువ్వే కాస్త ముందు స్లో చేసుకుంటే సరిపోయేదిగా అన్నాడు నాన్న.
మళ్ళీ క్లాష్….నా ఆలోచనకి,,నాన్న ఆలోచనకి…..
“నాన్నకేం తెలియదు”,అనుకున్నా మళ్లీ మనసులో…..
కాస్త దూరం వెళ్లగానే ఒక ఊరు వచ్చింది,కానీ రోడ్డు మీదే పెద్ద గొడవ మేం వెళ్లడానికి ఇప్పట్లో దారి ఇవ్వరనిపించింది,రోడ్డుమీద ఒక పంక్చర్ షాప్ కి వెళ్లి “ఏంటీ గొడవ” అన్నాం….
“ఏముంది సినెమా కథ!పోరిని లేపుకపోయి పెళ్ళి చేసుకున్నడు,ఇంటికి రాంగనె అయ్య తన్నక ముద్దు పెట్టుకుంటడా” అన్నాడతను…
డిగ్రీ సదువుకుంట ఏం ఎత్తిపోయిందనిరా ఇప్పుడు పెళ్లి అని కోపంగా అరుస్తున్నాడు ఆ అబ్బాయి తండ్రి…
ఆ ఊరి నుండి బయలు దేరిన రెండు నిమిషాలకు “బాగయింది వానికి,మంచిగ కొట్టిన్రు” అన్నాను నేను..
“ఏందుకు” అన్నాడు నాన్న.
“ఏందుకేంటి? సక్కగ సదువుకోక ఎందుకు పెళ్లి,ఇప్పుడు ఎలా పోషిస్తాడు”అన్నాను..
“ఆంటే,ఆ అబ్బాయికి జాబ్ ఉన్నా,లేక్స్ పోశించే స్థోమత ఉన్నా”చేసుకోవచ్చు అని అంటున్నావా అన్నాడు….
నాకేం మాట్లాడాలో తోచక మౌనంగా ఉన్నా,”నాకేం తప్పనిపించటంలేదు అన్నాడు నాన్న”..
అంటే నేను లేచిపోయి పెళ్ళిచేసుకున్నా ఇలానే ఏమీ అనకుండా ఉంటావా? అనడిగా..
నాన్న కాసేపు మౌనంగా ఉన్నాడు…
“పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులని మాత్రమే కాదు వారి సంస్కృతులను కూడా కలుపుతుంది,ప్రేమ పెళ్లి లో ఇద్దరు రెండు వేరువేరు సంస్కృతులనుండి వచ్చిఉండవచ్చు ఒకరి మీద ఒకరికి ఉన్నది నిజమైన ప్రేమే అయితే నేను చెప్పలేనుగానీ మోహం అయితే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు గొడవలు రావచ్చు,అయినా ఒకరిని మరొకరు,ఒకరి ఇష్టాలని ఇంకొకరు ,ఒకరి సంస్కృతిని ఇంకొకరు గౌరవించుకున్నంతకాలం ఏ సమస్యా రాదు” అయినా ఒక మనిషి తన జీవితంలో చేయగలిగే అతి ముఖ్యమైన పని తన సంస్కృతిని తన వారసులకి అప్పగించడమే! అన్నాడు నాన్న…..
అయితే నాన్న నాకేం ఇస్తాడో అనుకుని నవ్వుకున్నా….
“దారి తప్పినట్టున్నాం” అన్నాడు నాన్న ఓ పక్కగా బండిని ఆపుతూ…
“మంచిది!” అన్నాను నేను వ్యంగంగా…..
ఎవరినైనా అడుగుదాం అనుకుంటుండగానే ఒక వ్యక్తి కనిపించాడు చేతిలో సెల్-ఫోన్ తో,బహుశా ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు..”లేదు కరెంట్ లేదు పంట ఏం చేతికొస్తదో,అప్పన్నా తీర్తదో లేదో” అంటున్నాడు ఫోన్ లో..
సెల్-ఫోన్ ఎందుకో ఇతనికి అన్నాడు నాన్న..
అదేంటి కాలం మారిపోతుంది,టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడు ఉపయీగించుకోవాలి కదా? అన్నాన్నేను..
“అయితే ల్యాండ్-ఫోన్ ఉందికదా” అన్నాడు నాన్న..
నేనేం మాట్లాడలేదు..నాన్నది వితండవాదం అనిపించింది..
మళ్లీ నాన్నే “ఇతను రైతు పొలంలో ఎక్కువగా ఉంటాడు వానాకాలంలో అయితే మరీ ప్రమాదం అసలే ఆరుబయట సెల్ యూజ్ చేస్తే పిడుగు పడే ప్రమాదం ఎక్కువ” అన్నాడు…నవ్వలో ఏడవాలో తెలీలేదు,ఎందుకంటే ఇప్పుడు నాదగ్గరా సెల్ ఉంది,ఇప్పుడు నేనూ బయటే ఉన్నాకదా!మరి అతని దగ్గర ఉంటే తప్పేంటి అనుకుంటూఉండగానే నాన్న దారి అడిగేసాడు..
మళ్లీ మొదలు పెట్టాం మా ప్రయాణం…
ఊరు దగ్గరవుతున్నకొద్దీ నాన్న హుషారు పెరిగింది,ఇది మేము ఆడుకున్న స్థలం,ఇది మా దోస్తు ఇల్లు ఇలా చెపుతూ స్కూలుకి తీసుకు వెళ్లాడు.
అరె బాగా మారిపోయిందే అని నాన్న అంటుండగా మేము స్కూలు లోపలికి వెళ్ళాం,మేము వచ్చిన పని చెపితే మధ్యానం తరవాత రమ్మన్నారు,సరే అని ఊరిలోకి వెళ్లాం….
నాన్న చిన్నప్పుడు ఉన్న ఇంటికి వెళ్లాం,ఆ ఇంట్లో నాన్నతో పాటు చాలా మంది చుట్టాల పిల్లలు అక్కడి బడిలో చదువుకునేవళ్లు…ఆ ఇంట్లోకి మేము వెళ్లేసరికి ఒక ముసలావిడ దాదాపు ఆఖరి దశలో ఉన్నట్లుంది,గుమ్మానికి ఎదురుగా పడుకుని ఉంది..
“మేము వెళ్లగానే ఎవరూ!” అనడిగింది..
నేనత్తా అని నాన్న అంటుండగానే గుర్తుపట్టి “నువ్వారా ఇప్పుడే వస్తున్నవా అంత బాగున్నరా?” అనడుగుతూనే వాణీ అంటూ కూతురిని పిలిచింది.
ఇదెప్పుడో వచ్చింది అన్నాడు నాన్న ఆ ముసలావిడ కూతురిని చూస్తూ…
“ఆ మొగునితోని గొడవలొచ్చి నెలకింద ఒచ్చింది,ఇగ ఇక్కన్నే” అన్నది ముసలావిడ బాధగా..
ఆ ముసలావిడ కూతురిది అరేంజ్డ్ మారేజ్,ఎందుకో నాకు ఇందాక లవ్ మారేజ్ గురించి గుర్తొచ్చింది….
సరేగానీ నీ పరిస్థితి ఏంది? గిట్లయిపోయినవ్ అన్నాడు నాన్న..ఆ ముసలావిడని…
ఏముంది కొడుకులిద్దరూ ఎవనిది వాడే,నన్ను చూసే దిక్కు లేదు ఏదో ఇంకో కూతురు బియ్యం గిన పంపుతది,ఇగో ఇది వండి పెడతాంది …అంటూ ముసలావిడ తన కూతురిని చూసింది.
అయ్యో చిన్నపుడు ఎంతమందికి నీ చేతుల తోని తిండి పెట్టినవ్ ఎంత మందిని చదివించినవ్ నీకు గిట్లవుడేందే అన్నాడు నాన్న …
“అట్ల చేసిన పుణ్యానికే ఇంకా నాకు నాలుగు మెతుకులు దొరుకుతున్నయ్” అందా ముసలావిడ..ఆవిడ గొతులో బాధ లేదు..ఏదో త్రుప్తి ఉంది…..

కాసేపయ్యాక అట్లపొలం దిక్కు పొయ్యొస్త అని నాన్న నన్ను తీసుకుని పొలం దగ్గరకి వచ్చాడు,ఇదిగో ఇక్కడినుండి అంత మనోళ్లదే అని చూపించాడు,కనుచూపుమేరలో భూమి అంతా మనోళ్లదే కానీ ఎందుకో ఇదంతా వదిలేసి పోయిండ్రు పట్నం కి అన్నాడు నాన్న.
“ఆశ్చర్యం!” నాకూ అదే అనిపించింది….మా ఇద్దరి అభిప్రాయాలు చాన్నాళ్లతరవాత కలిసాయి…..
ఇదిగో ఇక్కడే చిన్నప్పుడు స్నానాలు చేసేవాళ్లం ఈత కొట్టేవాళ్లం అంటూ అంతా తిప్పి చూపించాడు నాన్న,అది చాలా పెద్దబావి పక్కనే గుడిస పెద్ద పెద్ద చింత చెట్లు వేప చెట్లు…ఆహ్….సూపర్ అనుకున్నా…..
“మా నాన్న మనసులో మూటకట్టుకున్న జ్ణాపకాలు విప్పితే నేను మా ఇంటినుండి తెచ్చిన అప్పాల మూట విప్పాను!,కాలం గాలిలో కలిసి మమ్మల్ని మా నాన్న చిన్నతనంలోకి తీసుకెళ్లింది”.
ఏందే ఎప్పుడొచ్చినవు?అంతా నిమ్మళమేనా? అంటూ వచ్చాడు ఆ ముసలావిడ కొడుకు..
నాన్న అతనితో మాట్లాడుతుంటే నేను చుట్టూ చూస్తూ కూర్చున్న దూరంగా ఒక పాము వస్తూ కనిపించింది,నేను ఏమీ ఆలోచించకుండా వెంటనే రాయి తీసుకుని కొట్టా…
“ఏ ఎందుకురా దాన్ని కొట్టినవ్”అన్నాడు నాన్న..
అదికూడా మనలా ఓ ప్రాణే కదా చదువుకున్నవ్ ఆ మాత్రం తెలీదా అన్నాడు ఆ ముసలావిడ కొడుకు..
“కొంతమంది ఇంట్ల అమ్మనే పట్టించుకుంటలేరు ఇంక బయట పాములని పట్టించుకునేదెవరు?” అని అనుకోకుండా అనేసాను…
మాడిపోయింది అతని మొహం,ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాడు…
నాన్నకు కోపం వచ్చింది ,నాతో ఏమీ మాట్లాడలేదు,వచ్చినపని అయిపోయాక మళ్లీ ఇంటికి తిరుగు ప్రయాణం మొదలయింది కానీ నాన్న ఏమీ మాట్లాడలేదు.
“అదిగో నెమలి” అన్నాడు నాన్న హఠాత్తుగా
రోడ్డుకి ఎడమవైపు చెట్లలోంచి రోడ్డుమీదుగా ఎగురుతూ రోడ్డుకి కుడివైపు చెట్లలోకి వెళ్లిపోయింది నెమలి,అంత పెద్ద శరీరం గాలిలో కాసేపయినా సరే అలా ఎగరటం ఓ అధ్భుతంగా అనిపించింది.
“బాగుంది కదా?” అన్నాడు నాన్న..
ఎంత ఎగిరినా చివరికి కిందపడాల్సిందేకదా అన్నాను నేను..
“ఏమయింది ” అన్నాడు నాన్న,నేను అలా ఎందుకన్నానో అర్ధమవక
“ఆ ముసలావిడ ఎందరికో ఎన్నో చేసిందన్నవుకదా కానీ చివరికి ఇలా బతుకుతోంది అలాంటప్పుడు ఆమె బ్రతుక్కి అర్థమేంటి?ఆవిడ కొడుకుని నేను ఒక మాటంటే ఏమయింది?” అనడిగా..
కాసేపు మౌనంగా ఉన్నాక నాన్న అన్నాడు “ఆమె తన పని తను చేసింది తన సంస్కృతిని,వ్యక్తిత్వాన్ని,గుణాన్ని తరవాతి తరానికి ఇచ్చింది,ఇంకేం కావాలి?”అన్నాడు నాన్న….
“అంటే?”అనడిగాను నాకు నిజంగానే ఏమీ అర్థంకాక తల పట్టుకుని!
నాన్న నవ్వుతూ “చూడరా!ఆవిడ అలా సహాయం చేసింది ఎవరినుంచో ఏమో ఆశించి కాదు,అక్కడ ఉండి చదువుకున్న వాళ్లలో ఎవ్వరికో ఒకరికి ఆ అలవాటు వచ్చిందనుకో ఇంకెంతమందికి సహాయం అందుతుందో ఆలోచించు” అన్నాడు.
సడన్ గా గుర్తొచ్చింది “ఆ తండా పిల్లలకి మా నాన్న మీద అంత అభిమానం ఎందుకో,నాన్న తన డబ్బులతో వాళ్లకి బట్టలు,పుస్తకాలు తీసుకెళుతుంటే నేను చికాకు పడ్డరోజులు గుర్తొచ్చాయి.వాళ్లలో ఎంతమంది ఈ అలవాటు నేర్చుకుంటారో కదా అనుకుంటుంటే అర్ధమయింది….నాన్న నాకు ఏమిస్తాడొ..నాన్న నుండి నేను నేర్చుకోవలసింది..నా తరవాత తరానికి అందించాల్సింది ఏమిటో”….
నా ఆలోచనల్లో నేనుండగా నాన్న అడిగాడు “నడుపుతావా బండి?” అని….
“ఆ,నడుపుతా!”అన్నా ఏమీ ఆలోచించకుండానే………………

అక్టోబర్ 16, 2011 Posted by | అనంతమైన ఆలోచనలు.. | అభిప్రాయములు

కిచిడి……[ఇది వంట గురించి కాదు...]

ఆ దారెమ్మట నడుస్తోంటె….
జ్ఞాపకాలు కాళ్లకడ్డం పడుతున్నయ్…..
———————————-
ఏమిటో ఈ వింతలోకం….
అర్ఠంకాని పెద్ద అరణ్యం….
———————————-
దూరం నుండి ప్రతీ జీవితం….
సువాసనల పూలవనం…….
దగ్గరకెలితే ఓ క్షణం………
తెలుస్తుందిలే నిజం………
———————————-
నిజంగానే గొప్పదా తీర్ఠం……
అది కేవలం మన నమ్మకం…
నమ్మకమే కదా యదార్ఠం….
———————————-

॒@ ఇక నుండి ప్రతి పోస్ట్ లో నేను నెక్స్ట్ రాయబోయే పోస్ట్ పేరు చెపుదామని డిసైడ్ అయ్యా…
next post: రాత్రి మూడింటికి దయ్యం కుక్కలా మారింది….

జులై 6, 2011 Posted by | అనంతమైన ఆలోచనలు.. | వ్యాఖ్యానించండి

నా కూతురి ఫోటోలు…………….

మే 11, 2011 Posted by | అనంతమైన ఆలోచనలు.. | అభిప్రాయములు

నేను చేసిన బొమ్మ

ఓ రోజు M-seal పట్టుకుని కూచుంటే బొమ్మ చేద్దామనిపించింది..సరే అని మొదలెడితే ఇదిగో ఇలా తయారయింది….

అన్నట్లు ఇవి నా 2 మెగాపిక్స్ కెమెరా తో తీసినవి అందుకని క్లారిటీ కాస్త బావుండదు..సర్దుకుపోండి…

ఏం చేసి మాత్రం ఏం లాభం….
దున్నపోతుకి ఎక్కువ ఏనుక్కి తక్కువ ఉండే నా బామ్మర్ది ఒక కాలితో తొక్కి దాన్ని నాశనం చేశేసాడు……
:(

మే 11, 2011 Posted by | Uncategorized | 1 వ్యాఖ్య

నేను రాసి,,పాడిన పాట,,విని అభిప్రాయం చెప్పండి..ప్లీజ్..

pls click the below link to listen song….
http://www.esnips.com/doc/bc731662-4fe6-4dd5-a793-2b9a0f0b7816/Ne-Ontarini

here comes the lyrics…..

నే…ఒంటరిని
నిజంగా ఒంటరిని..
కలిస్తే సంద్రాన్ని..విడిపోతే జలపాతాన్ని..
గెలిస్తే స్వర్గాన్ని..ఓడితే మెలకువని..
జీవిస్తే జ్ణాపకాన్ని..మరణిస్తే ఒక తీపి కలని…
నే…ఒంటరిని
నిజంగా ఒంటరిని..
ఆ..దారంతా..ముళ్లబాట..
మార్చేసా..దాన్నొక పూలతోట…
నువు తీస్కో పూలన్నీ..నాకిచ్చెయ్ ముళ్లనన్నీ..
ముళ్లనే నాటుతా..పూలనే నే మళ్లీ పూయిస్తా..
నువు తీస్కో పూలన్నీ..నువు తీస్కో పూలన్నీ
నే…ఒంటరిని
నిజంగా ఒంటరిని..
కళ్లల్లో మెరుపునీ..
శ్వాసలో విశ్వాసాన్ని..
గుండెలో ఆలోచనని..
ఆలోచనలో..అనుభవాన్నీ..
హే..హే..హే..హే
నే..మెజీషన్..నీ..నీకోసం చేస్తా ఒక షోనీ..
నువు తీస్కో సంతోషాన్ని..నాకిచ్చెయ్ నీ భాదలన్నీ..
నే..
మెజీషన్ నీ…
మార్చేస్తా..భాదని సంతోషంలోకీ..హే..హే..
నువు తీస్కో సంతోషాన్ని..నువు తీస్కో సంతోషాన్ని..
నే…ఒంటరిని
నిజంగా……………….. ఒంటరిని..హే……..

————————————————————–

నేను ఈ పాట రాసి 2 సంవత్సరాలు కావస్తోంది…….ఇన్నాళ్లకి సాహిత్యంతో పాటు బ్లాగ్ లో రాసేసా :)

ఫిబ్రవరి 7, 2011 Posted by | నేను రాసిన పాటలు.... | అభిప్రాయములు

మొబైల్ లో తెలుగు చదవచ్చు ఇలా….!!!

ఈ విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండవచ్చు..

తెలియని వాళ్లకి ఉపయోగపడుతుందని ఈ ప్రయత్నం..

౧)మొబైల్ లో ఓపెరా మిని బ్రౌజర్ ను ఇన్స్టాల్ చేయండి.(m.opera.com)

౨)అడ్రస్ బార్ లో opera:config అని టైప్ చేయండి.

౩)అందులో చివరి option
“use bitmap fonts for complex scripts”  కి yes
ఎంచుకోండి.

౪)సేవ్ చేయండి.

ఇప్పుడిక మీ మొబైల్ లో తెలుగు చదువుకోండి(ఒపెరా లో మాత్రమే :p )

—————————————————————–

ఇప్పుడే నా మొబైల్ లో ఇలానే ప్రయత్నిస్తే తెలుగు వచ్చింది..అందుకే మీతో పంచుకుంటున్నా…

source:http://groups.google.com/group/telugublog/msg/6e17d08bfa1979cf

జనవరి 30, 2011 Posted by | అనంతమైన ఆలోచనలు.. | , , , , , | అభిప్రాయములు

నేను దివాలా తీస్తే ఇలా ఉంటానన్నమాట

నవంబరు 22, 2010 Posted by | ఏదో సోది | అభిప్రాయములు

Follow

Get every new post delivered to your Inbox.